Thursday 23 February 2012

గూగుల్ బజ్, ప్రైవసీ సమస్యలు...

మైక్రోబ్లాగింగు మీద నా ఇంతకు ముందు టపా చదివే ఉంటారు. ఇప్పటికే అది బాగా ఊపందుకుందని మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఎంతగా అంటే అన్ని సోషల్ నెట్వర్కింగ్ వెబ్‌సైటులూ దానిని ఏదో ఒక రూపంలో అమలు చేసేంతగా. ఉదా: ఫేస్‌బుక్ స్టేటస్ అప్‌డేట్‌లూ (What's on your mind ?), ఆర్కుట్ (what are you up to?) వగయిరా. బజ్ ఏమిటి ?
ఇది గూగుల్ నుంచి కొత్తగా వచ్చి చేరిన వెబ్‌ అప్లికేషను. సోషల్ నెట్వర్కింగూ, మెసేజింగూ కలిపి తయారు చేసిన ఉపకరణం ఇది. ఒక రకంగా చెప్పాలంటే ట్విట్టర్, ఫ్రెండ్‌ఫీడ్ లోని విశేషాలను కలిపి తయారు చేసిన ఉపకరణం. జీ మెయిలులో భాగంగా దీనిని విడుదల చేసారు. ఈ ఉపకరణాన్ని మీరు పొందాలంటే మీ జీ మెయిలుకి వెళ్ళి వాడటమే. ఈ ఉపకరణం ద్వారా మీరు మీ ఫాలోయర్లకి మీ స్టేటస్ అప్‌డేట్లూ, మీ ఇతర సర్వీసుల (ఫ్లికర్, గూగుల్ రీడర్, ట్విట్టర్ వగయిరా) నుంచి అప్‌డేట్లూ అందరితో పంచుకోవచ్చు. ఇందులో మీరు ప్రచురిస్తున్న సమాచారం మీ గూగుల్ ప్రొఫైలు ద్వారా అందరికీ చూపించబడుతుంది. ఇందులోని స్నేహితుల కాన్సెప్టు ట్విట్టరు లాగానే. ఇతర జనాలు మిమ్మల్ని ఫాలో అవవచ్చు. మీరూ ఇతరులని ఫాలో అవవచ్చు. వారి నుంచి అప్‌డేట్లు మీకు బజ్ ద్వారా చూపించబడతాయి, అలాగే మీ నుంచి వారికీనూ. వారి అప్‌డేట్ల మీద వ్యాఖ్యలు చేసే సదుపాయం మీకుంటుంది. చర్చకి వీలుగా మీరు వారిని ఉద్దేశించడానికి @<వాడుకదారుని పేరు> వాడవచ్చు. బజ్ గురించి: జీ మెయిలులో అంతర్భాగంగా దీనిని విడుదల చేయడానికి అనేక కారణాలు ఉన్నా ముఖ్యమయినది ఏమీ శ్రమ లేకుండా మిలియన్ల కొద్దీ వాడుకదారులు వచ్చెయ్యడం. ఒక ఆర్కుటో, ఫేస్‌బుకో, ట్విట్టరో అయితే వాడుకదార్లు తమంతట తాముగా ఆ సర్వీసుకి సైనప్ చెయ్యవలసి ఉంటుంది. అయితే జీ మెయిలులో భాగంగా ఈ బజ్ ఉపకరణాన్ని చేర్చడం వల్ల మళ్ళీ వాడుకదార్లు సైనప్ చెయ్యకుండా ఆటోమేటిగ్గా వారిని బజ్ వాడుకదార్లుగా మార్చివేసింది. అదీనూ వాడుకదారులకి మీరు బజ్ ఉపయోగించాలనుకుంటున్నారా ? అని అడగకుండా బజ్ ఉపయోగించవద్దనుకుంటున్నారా ? అనే ప్రశ్నని మాత్రమే అడిగింది గూగుల్. అంటే ఆప్ట్ ఇన్ మదులు ఆప్ట్ అవుట్ అన్నమాట. దీని వల్ల వాడుకదార్లకి అసలు నిర్ణయించుకునే హక్కునే ఇవ్వలేదు. అదీ కాక ఆప్ట్ అవుట్ ఆప్షన్ మొదట్లో అంత సులభంగా కనుక్కోలేకుండా ఉంచింది. దీని వల్ల ఏమయిందంటే గూగుల్ అనే క్రేజ్ బట్టి కొంత, ఎలాగూ వచ్చి చేరింది కదా వాడితే పోలా అని కొంత జనాలు దీనిని ఉపయోగించడం మొదలుపెట్టారు. ఇక విడిగా ఉపకరణం విషయానికొస్తే ఇది కొత్త ఆలోచనేమీ కాదు. ట్విట్టర్‌లో మాదిరిగా స్టేటస్ అప్‌డేట్లూ, ఫ్రెండ్‌ఫీడ్ మాదిరిగా వివిధ ఇతర ఉపకరణాల నుంచి సేకరించిన తాజీకరణలూ కలిపితే వచ్చిందే బజ్. అయితే మీ మెయిలు బాక్సులో ఉంచడం వల్ల మీరు మెయిళ్ళు చదవగానే, ఆ కిందే ఉన్న బజ్‌లో చూపించే చదవని బజ్ సంఖ్యని చూసి దాని వైపూ దృష్టి సారిస్తారు. అలా వాడటం అలవాటు చేసింది గూగుల్. ఇది తప్పని కాదు, ఇది వీరి స్ట్రాటజీ. (ఆదరణ పొందిన తరువాత బజ్ విడిగా ఒక ఉపకరణంగా రూపొందుతందని నాకు బలంగా అనిపిస్తుంది. ఈ స్ట్రాటజీ కేవలం వాడుకదారులని పొందటానికి ఉద్దేశించినది మాత్రమే అని నా అభిప్రాయం.) బజ్‌లో ప్రైవసీ సమస్యలు: అయితే ఈ ఉపకరణం విడుదలలో గూగుల్ చాలా పొరపాట్లు కూడా చేసింది. అన్నిటి కన్నా ముఖ్యమయినది ప్రైవసీని అంతగా పట్టించుకోకపోవడం. ౧. బజ్‌లో మీరు ఎంచుకోకుండానే ఆటోమేటిగ్గా మీకు ఫాలోయర్లు వచ్చి చేరుతారు. వీరెవరంటే మీరు జీ మెయిలులో తరచూ మెయిల్ చేసే వాళ్ళూ, జీ టాక్‌లో తరచూ చాట్ చేసేవాళ్ళూ అన్నమాట. మీ అనుమతి లేకుండా వారందరినీ మీ ఫాలోయర్లుగా చేర్చేసింది గూగుల్. మీరు కావాలనుకోకపోయినా మిమ్మల్నీ వేరేవారికి ఫాలోయర్లుగా మార్చివేసింది. ఇది పెద్ద బ్లండర్. ఎందుకంటే ఆన్‌లైనులో మీరు చేసే కార్యకలాపాలను ఎవరితో పంచుకోవలనేది ఎప్పటికీ మీరే నిర్ణయించుకోవాలి కానీ ఏ ఇతర ఉపకరణమూ కాదు. ఇదే కాకుండా మీరు ఎవరికి ఎక్కువగా మెయిల్ చేస్తారు, ఎవరితో ఎక్కువగా మాట్లాడతారు అనే విషయాన్ని అందరికీ తేటతెల్లం చేసింది. ఎందుకంటే మీకు గూగుల్ ప్రొఫైలు ఉంటే దాంట్లో మీ ఫాలోయర్ల వివరాలు చూపించబడతాయి. దీనిని ఇప్పుడు సరి చేసింది గూగుల్. ఇప్పుడు ఆటోమేటిగ్గా ఫాలోయర్లుగా మార్చకుండా కేవలం సజెషన్‌గా మాత్రమే చూపిస్తుంది. అదీ కాక ఇప్పుడు మీ గూగుల్ ప్రొఫయిలు నుంచి ఫాలోయర్ల వివరాలని దాచేలా ఆప్షన్ ఇచ్చింది. ౨. బజ్‌ని గనుక మీరు మీ మొబైలు/స్మార్ట్‌ ఫోను నుంచి వాడుతుంటే అది మీ ప్రదేశాన్ని ఆటోమేటిగ్గా అప్‌డేట్ చేసే అవకాశం ఉంది. గూగుల్ మొబైల్ అప్లికేషను మీ మొబైలు ద్వారా మీరు ప్రస్తుతం ఉన్న ప్రదేశం వివరాలను మీ బజ్ ద్వారా ఇతరులకి చేరవెయ్యచ్చు. మీకు ఈ అమరికని మార్చుకునే సదుపాయం ఉంది కానీ పొరపాటున ఇది కనుక చేతనం చెయ్యబడి ఉంటే ఇది పెద్ద ప్రైవసీ సమస్యే. ౩. బజ్ మీ జీ మెయిలు అకౌంట్‌తో జోడించబడి ఉంది కాబట్టి దాని అవసరాలకి జీ మెయిలు ఐడెంటిటీని వాడుకుంటుంది. ఈ పద్ధతి కొన్ని సమస్యలు తెస్తుంది. ఒకవేళ మీరు బజ్ ద్వారా ఎవరికయినా రిప్లై ఇస్తున్నారనుకోండి మీరు దానిని @<వాడుకదారుని చిరునామా> పద్ధతిలో ఇవ్వవచ్చు. బజ్ ఆటోమేటిగ్గా ఆ వాడుకదారు పేరుని మీకు సూచిస్తుంది. అయితే ఆ వాడుకదారునికి గనుక గూగుల్ ప్రొఫైలు లేకపోతే జీ మెయిలు అడ్రసు ప్రచురించబడుతుంది. దాని ద్వారా ప్రపంచమంతటికీ ఆ జీ మెయిలు అడ్రసు ఇచ్చినట్టే, ఎందుకంటే మీ బజ్‌లన్నీ మీ గూగుల్ ప్రొఫైలులో చూపించబడతాయి. మీ ప్రొఫైలు గనుక బహిరంగమైనది అయితే ఎవరయినా ఆ జీ మెయిలు అడ్రసు చూడగలరు. దీనిని కూడా గూగుల్ ఇప్పుడు సరి చేసినట్టుంది.

No comments:

Post a Comment